మిగతా ఇతర సంస్థలతో పోలిస్తే  చాలా ఏళ్ళ క్రితం విడుదలైన ఫోన్లకు కూడా ఎప్పటికప్పుడు లేటెస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్లు అందించడంలో Xiaomi  వినియోగదారుల ఆదరణ చూరగొంటూనే ఉంది. అయితే ప్రతీ దానికీ ఓ హద్దు ఉంటుంది కదా. ముఖ్యంగా పాత ఫోన్ లకు అప్డేట్స్ ఇవ్వాలంటే మరింత శ్రమతో కూడుకున్న వ్యవహారం.
దీన్ని దృష్టిలో పెట్టుకొని Xiaomi తాజాగా కొన్ని పాత ఫోన్ మోడల్ లకు అప్డేట్స్ నిలిపివేస్తున్నట్లు చూఛాయగా తెలిసింది. MIUI చైనీస్ ఫోరమ్‌లో  ఆ సంస్థ చేసిన ఇటీవలి పోస్ట్ దీన్ని స్పష్టం చేస్తోంది. ఇందులో భాగంగా Redmi Note 3, Mi 4, Mi 4C, Mi 4S, Mi5 ఫోన్లకి MIUI 11 వెర్షన్ లభించబోవడం లేదు. గత కొంతకాలంగా MIUI 10 దాదాపు అధికశాతం Xiaomi ఫోన్లకి  లభించడం చూస్తూనే ఉన్నాం.
Mi 5, Redmi Note 3 ఫోన్ల  విషయంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న MIUI 10.2నే  చిట్టచివరి వెర్షన్‌గా పేర్కొనబడింది. అయితే ఈ ప్రస్తావన అంతా చైనీస్ ఫోరమ్‌లో జరగడం అన్న,  ఇండియా లాంటి దేశాలకు Xiaomi సంస్థ Global ROMని విడుదల చేస్తూ ఉంటుంది కాబట్టి, చైనాలో అనుసరించబడిన విధానాన్నే  ఇండియాలో కూడా అనుసరిస్తుందా లేదా అన్నది వేచిచూడాల్సి ఉంది. 
ఏదేమైనా కాల క్రమంలో కొన్ని పాత ఫోన్ లకు అప్డేట్లు నిలిపివేయడం కొత్తేమీ కాదు. దానికి సిద్ధపడి పాత వాటిని అలాగే వాడుకోవటం కానీ,  లేదా కొత్త వాటిని కొనుగోలు చేయడం గానీ చేయక తప్పదు.........

Comments